Wednesday, 22 September 2010

ఏదో ప్రతిస్పందించాలనే కోరిక ....

ఈ మధ్య మా స్నేహితుడు 'రాధేశ్యాం' తన బ్లాగు లో ఒక కవిత్వం రాసాడు. అది ఇక్కడ మరల పొందుపరుస్తున్నాను. దానికింద నా ప్రతిస్పందన కూడా చదవండి. 'రాధేశ్యాం' బ్లాగు కై ఇక్కడ క్లిక్ చేయండి.

ఏదో
రాయాలనే కోరిక.. .
**** -- రాధేశ్యాం రచన
ఏదైనా చదవగానే నాకూ రాయాలనే కోరిక...
ఏదో ఒక కధ, వ్యాఖ్య, కవిత లేదా శీర్షిక..
ఏం రాయాలో ఎలా రాయాలో తెలియక...

మనసులోని ఆలోచనలు కుదురుకోక...
కుదురుకున్న ఆలోచనలకు రూపం రాక..
వచ్చిన రూపాన్ని అక్షరబద్ధం చెయ్యలేక..

రాద్దామని కూర్చుంటే మొదలుపెట్టలేక..
ఎంత కిందా మీదా పడ్డా బుర్రకేం తోచక..
అందరూ రాసేసే సులువు అర్ధం కాక...

పోనీ మానేద్దామంటే మనసొప్పక...
అలాగని మనసోప్పే సాకు దొరకక...
అవస్థపడుతున్న నాకో దారి కానరాక...

పెన్ను మూసేసి పేజీని తెల్లగానే వదిలేశాక...
ఏమైనా రాయాలనే కోరిక ఇంకా చావక...
నిన్నట్లాగే అనుకుంటా..."రేపు వ్రాసెద గాక!!"

ఏదో
ప్రతిస్పందించాలనే కోరిక..
****** చందు రచన
ఏదైనా చదవగానే నాకూ రాయాలనే కోరిక ...
ఏదో ఒక గ్రంథం , నవల , లేదా పీఠిక ...
ఏం రాయాలో , ఎందుకు రాయాలో తెలిసీ తెలియక ...

తలపై ఆలోచనలు ఎప్పటికీ ఆగక ...
ఆగిన ఆలోచనలను చెక్కలేక ...
చెక్కిన ఆలోచనలను కలంలోకి తేలేక ...

రాద్దామని కూర్చుంటే ఎప్పటికీ లేవలేక...
ఎంత అటు తిరిగి ఇటు తిరిగినా మదికేం తట్టక ...
కొందరు రాసేసే మెలకువలు అర్థం అయ్యీ అవ్వక...

మానేద్దామని అస్సలనిపించక ...
అనిపిస్తే మానేసే సాకు దొరకక ...
కష్టపడుతున్న నాకో వెలుగు కనబడక ...

పెన్ను తెరిచి పేజీని నింపి , చింపి వదిలేశాక ...
ఏమైనా రాయాలనే కోరిక ఇంక ఎప్పటికీ వదలక ..
ఎప్పట్లాగే అనుకుంటా ... "మరల వ్రాసెద గాక"


అప్పటివరకు పాడుకుంటా నా మనసనే తూనీగ తో ...
తూ... నీ... గ... తూనీగా ఎందాక పరిగెడతావే ... రావే నా వంకా ...
********

దీనికి రాధేశ్యాం ప్రతి ప్రతి స్పందన :
చందు.. బాగుంది.. కానీ నాచురల్లీ నాదే నాకు నచ్చింది.. హ హ్హ..
ఇదికూడా చూడు..

ఆలసించక..
మడమ త్రిప్పక..
ఇంక మనమా కోరిక
మనసులలో దాచుకోక
పేజీని తెల్లగా వదిలెయ్యక..
అలాగని రాసింది చింపెయ్యక..
ఎక్కువాలోచించక ముందు వెనక..
మొదలుపెట్టాలి వ్రాయటం మనమింక..
******

దీనికి నా ప్రతి ప్రతి ప్రతి స్పందన :
వ్రాయాలి వ్రాయాలి కవిత్వం ఎప్పటికైనా మనమింక ...
పీకల్లోతుగా మునిగి ఆలోచించింది చాలింక ...
లేదంటే వేస్తాం మనం నిండైన మునక ...
అదిగో అల్లదిగో వాస్తవమనే నౌక ...
మనకు ఏనాటికీ అది అందక ...
తప్పదు పట్టుకోవాలింక ...
కవిత్వమనే కుక్క తోక ...
మరి ఆలసించక ...
ఈదు ఇక ...

Friday, 15 June 2007

మళ్లీ 'friday' వచ్చేసింది. ఇలా ఏడాదికి 52 సార్లు చొప్పున ,
10 ఏళ్లకి 520 సార్లు,
20 ఏళ్లకి 1040 సార్లు,
30 ఏళ్లకి 1560 సార్లు,
40 ఏళ్లకి 2080 సార్లు,
50 ఏళ్లకి 2600 సార్లు,
60 ఏళ్లకి 3120 సార్లు,
70 ఏళ్లకి 3640 సార్లు,
80 ఏళ్లకి 4160 సార్లు,
90 ఏళ్లకి 4680 సార్లు,
100 ఏళ్లకి 5200 సార్లు అనుకోవాలని తలుచుకొంటూ .. ఇంతటితో ఈ టపా కి సెలవ్.

;)

Tuesday, 12 June 2007

హై టెక్ సిటీ -- వాట్ ఏ పిటీ !!

నేను గత కొన్ని నెలల నుండి హైటెక్ సిటీ లో పని చేస్తున్నా. ముందు ఆహా ఓహో అనిపించినా , కొన్ని సమస్యలు ఉన్నాయింకా ... ఉదయం రష్ అవర్ లో సైబర్ టవర్స్ నుండి హైటెక్ సిటి వైపు ఎంతో మంది నడిచి పోతూ ఉంటారు .. కాని హాశ్చర్యం ! ఫుట్‌పాత్‌లే లేవు. రోడ్డు మీద ప్రమాదకరంగా నడవ్వలసిందే .. ప్రపంచ ప్రఖ్యాత హైటెక్ సిటీ లో ఫుట్‌పాత్‌లు లేవు .. వాట్ ఏ పిటీ...

రాత్రి పదిగంటలకు సైబర్ టవర్స్ వద్ద ట్రాఫిక్ ఇంకా రద్దీగా ఉంటూనే ఉంటుంది .. అయినా ఆ టైముకి ట్రాఫిక్ పోలీసులు మాయం.. అంతా గందరగోళం.. జామ్‌లు... ఇక కొంత మంది ప్రజలే పూనుకొని ట్రాఫిక్ కంట్రొల్ చెయ్యవలసి వస్తుంది... ఇదంతా ప్రపంచ ప్రఖ్యాత హైటెక్ సిటీలో.. వాట్ ఏ పిటీ ...

నా బ్లాగులో ఏం రాయాలి?

ఏం రాయాలో బుర్ర చించుకుంటుంటే , నా ముందు కొన్ని ప్రత్యామ్నాయాలు కనిపించాయి.

1) కల్పిత మరియు ఊహా రచనలు - కథలు, కవిత్వం వగైరా (నా రచనలు)
2) విమర్శనాత్మక రచనలు - ఇతరుల కల్పిత రచనలు విమర్శించడం

3) అనుభవైక రచనలు - నా నిత్య, దైనందిన అనుభవాలు
4) వ్యాఖ్యలు - నేటి ప్రపంచం తీరు పై నా వ్యాఖ్యలు


ప్రస్తుతానికి నేను 3) మరియు 4) నే ఎంచుకున్నాను.

Monday, 11 June 2007

నా మొదటి పోస్టు

ఇది ఒక గంగోత్రి ...
ఇది ఒక యమునోత్రి ...
ఇది ఒక తలకావేరి ...
ఇది ఒక మహాబలేశ్వరం ...
ఇది ఒక త్ర్యంబకేశ్వరం ...
ఇది ఒక యేరువాక పుట్టిల్లు ...
ఇది నా మొదటి పోస్టు ...

కొన్ని తెలుగు బ్లాగుల స్ఫూర్తితో ఈ బ్లాగు మొదలు పెట్టాను.
ఏం రాయాలో నిర్ణయించుకోలేదింకా ...
ఆలోచనలు ఊరుతున్నాయింకా...

చదివినా,చదవకపోయినా,
చూసినా,చూడకపోయినా,
విన్నా,వినకపోయినా,
నచ్చినా,నచ్చక పోయినా,
అరిగినా,అరగకపోయినా,

నా ఆలోచనలు త్వరలో ....