Wednesday, 22 September 2010

ఏదో ప్రతిస్పందించాలనే కోరిక ....

ఈ మధ్య మా స్నేహితుడు 'రాధేశ్యాం' తన బ్లాగు లో ఒక కవిత్వం రాసాడు. అది ఇక్కడ మరల పొందుపరుస్తున్నాను. దానికింద నా ప్రతిస్పందన కూడా చదవండి. 'రాధేశ్యాం' బ్లాగు కై ఇక్కడ క్లిక్ చేయండి.

ఏదో
రాయాలనే కోరిక.. .
**** -- రాధేశ్యాం రచన
ఏదైనా చదవగానే నాకూ రాయాలనే కోరిక...
ఏదో ఒక కధ, వ్యాఖ్య, కవిత లేదా శీర్షిక..
ఏం రాయాలో ఎలా రాయాలో తెలియక...

మనసులోని ఆలోచనలు కుదురుకోక...
కుదురుకున్న ఆలోచనలకు రూపం రాక..
వచ్చిన రూపాన్ని అక్షరబద్ధం చెయ్యలేక..

రాద్దామని కూర్చుంటే మొదలుపెట్టలేక..
ఎంత కిందా మీదా పడ్డా బుర్రకేం తోచక..
అందరూ రాసేసే సులువు అర్ధం కాక...

పోనీ మానేద్దామంటే మనసొప్పక...
అలాగని మనసోప్పే సాకు దొరకక...
అవస్థపడుతున్న నాకో దారి కానరాక...

పెన్ను మూసేసి పేజీని తెల్లగానే వదిలేశాక...
ఏమైనా రాయాలనే కోరిక ఇంకా చావక...
నిన్నట్లాగే అనుకుంటా..."రేపు వ్రాసెద గాక!!"

ఏదో
ప్రతిస్పందించాలనే కోరిక..
****** చందు రచన
ఏదైనా చదవగానే నాకూ రాయాలనే కోరిక ...
ఏదో ఒక గ్రంథం , నవల , లేదా పీఠిక ...
ఏం రాయాలో , ఎందుకు రాయాలో తెలిసీ తెలియక ...

తలపై ఆలోచనలు ఎప్పటికీ ఆగక ...
ఆగిన ఆలోచనలను చెక్కలేక ...
చెక్కిన ఆలోచనలను కలంలోకి తేలేక ...

రాద్దామని కూర్చుంటే ఎప్పటికీ లేవలేక...
ఎంత అటు తిరిగి ఇటు తిరిగినా మదికేం తట్టక ...
కొందరు రాసేసే మెలకువలు అర్థం అయ్యీ అవ్వక...

మానేద్దామని అస్సలనిపించక ...
అనిపిస్తే మానేసే సాకు దొరకక ...
కష్టపడుతున్న నాకో వెలుగు కనబడక ...

పెన్ను తెరిచి పేజీని నింపి , చింపి వదిలేశాక ...
ఏమైనా రాయాలనే కోరిక ఇంక ఎప్పటికీ వదలక ..
ఎప్పట్లాగే అనుకుంటా ... "మరల వ్రాసెద గాక"


అప్పటివరకు పాడుకుంటా నా మనసనే తూనీగ తో ...
తూ... నీ... గ... తూనీగా ఎందాక పరిగెడతావే ... రావే నా వంకా ...
********

దీనికి రాధేశ్యాం ప్రతి ప్రతి స్పందన :
చందు.. బాగుంది.. కానీ నాచురల్లీ నాదే నాకు నచ్చింది.. హ హ్హ..
ఇదికూడా చూడు..

ఆలసించక..
మడమ త్రిప్పక..
ఇంక మనమా కోరిక
మనసులలో దాచుకోక
పేజీని తెల్లగా వదిలెయ్యక..
అలాగని రాసింది చింపెయ్యక..
ఎక్కువాలోచించక ముందు వెనక..
మొదలుపెట్టాలి వ్రాయటం మనమింక..
******

దీనికి నా ప్రతి ప్రతి ప్రతి స్పందన :
వ్రాయాలి వ్రాయాలి కవిత్వం ఎప్పటికైనా మనమింక ...
పీకల్లోతుగా మునిగి ఆలోచించింది చాలింక ...
లేదంటే వేస్తాం మనం నిండైన మునక ...
అదిగో అల్లదిగో వాస్తవమనే నౌక ...
మనకు ఏనాటికీ అది అందక ...
తప్పదు పట్టుకోవాలింక ...
కవిత్వమనే కుక్క తోక ...
మరి ఆలసించక ...
ఈదు ఇక ...